దువ్వాడ జగన్నాథమ్ - కథ కథనం - విశ్లేషణ


దువ్వాడ జగన్నాథమ్ - కథ కథనం - విశ్లేషణ 

దిల్ రాజు గారి నుంచి 25 వ సినిమా, జనరల్ గా నిర్మాణ సంస్థ కి  మైల్ స్టోన్ సినిమాలు స్పెషల్ గా ఉండాలి అని కోరుకుంటారు కానీ ఈసారికి  కమర్షియల్ గా వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయి, సరైనోడు తో కమర్షియల్ స్టామినా ప్రూవ్ చేసుకున్న బన్నీ, కమర్షియల్ సినిమాలని హేండిల్ చెయ్యగల సత్తా ఉన్న హరీష్ కాంబినేషన్ సెట్ చేసినట్టు ఉన్నారు. బ్రాహ్మణ పాత్ర లో బన్నీ అనగానే ఎలా చేస్తాడో అనిపించినా ట్రైలర్ తో ఆ డౌట్స్ అన్ని పటాపంచలు చేసేసి ఇంక ఎంటర్టైన్మెంట్ కి కొదవు ఉండదేమో అనే నమ్మకం కలిగించాడు. ట్రైలర్ తోనే సినిమా ఎలా ఉండబోతుంది (ఎక్కడో చూసేసినట్టు ఉంది) అని ఒక అంచనాకి వచ్చేసినా, సినిమా లో ఎదో ఒకటి కొత్తగా ఉంటుంది ఏమోలే అనే ఆశతో వెళ్లిన వాళ్ళకి ఈ సినిమా ఎం ఇచ్చింది? టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కొల్లగొడుతున్న డీజే అందరికి మంచి లాభాలు తెచ్చిపెట్టాలి అని ఆశిస్తూ, ఎప్పటిలాగానే  కథ కథనం ని విశ్లేషించుకుందాం. 

సినిమా చూడని వాళ్ళు ఇది చదవక పోవటమే మంచిది. ఇది కేవలం నాకు ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్ తో వ్రాస్తున్నది మాత్రమే అని గమనించగలరు.

కథ
"ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది" అని 
"మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనిపించాల్సిన అవసరం లేదు" నమ్ముతూ తన ఐడెంటిటీ పక్కన పెట్టి బయట జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తూ వస్తున్నకుర్రాడికి తన వాళ్ళకి అన్యాయం జరిగితే? అందులో బాధితులు ఐన ఎంతో మందికి జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి పెద్ద మనుషులతో పెట్టుకోవాల్సి వస్తే? 

ఇదే కథ ని కొంచెం డిటైలింగ్ చేసుకుంటే, బ్రాహ్మణ వంటవాడిగా పుట్టిన దువ్వాడ జగన్నాథమ్ కి చిన్నప్పటి నుంచి అన్యాయం ని చూస్తూ సహించలేడు, ఒక పోలీస్ సహాయం తో అప్పుడుడప్పుడు పేరు- వేషం మార్చుకొని బయట ప్రపంచానికి తెలియకుండా అన్యాయం చేసిన వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. ఒక అమ్మాయితో ప్రేమలో పడి తిరస్కరింపబడతాడు. ఇంతలో తన బాబాయి లాంటి వ్యక్తి ఒక స్కామ్ లో మోసపోయి ఆత్మహత్య చేసుకుంటాడు. తన సొంత మనిషికి జరిగిన అన్యాయం కోసం ఎదిరించటానికి సిద్ధపడతాడు. అదొక పెద్ద స్కాం అని, అందులో చాల మంది నష్టపోయారు అని, దాని వెనుక చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అని తెలుసుకుంటాడు. వాళ్ళని మట్టుబెట్టి ఆ స్కాం ద్వారా వాళ్ళు దోచుకున్న డబ్బుని జనాలకి పంచేస్తాడు. ఇక్కడ ఫస్ట్ లైన్ మొదలు పెట్టినప్పుడే లాస్ట్ లైన్ ఏంటో తెలిసిపోయే అంత కథ ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి సినిమాలు ఎన్నో చూసేసాం, ఇలాంటి సినిమాలు ట్రీట్ చెయ్యటం లో శంకర్ సర్ (హరీష్ శంకర్ గారు కాదు) అందివేసిన చెయ్యి. క్యారెక్టర్ బిల్డ్ చెయ్యటం నుంచి, ఎమోషన్ పండించటం, జస్టిఫికేషన్ ఇవ్వటం లో అయన తర్వాతే ఎవరైనా. మరి మన హరీష్ శంకర్ గారు ఎంచుకున్న ట్రీట్మెంట్ ఏంటో చూద్దాం.  

కథనం : 

ప్రారంభం: పాత్రలు - పరిచయాలు : తన తండ్రి మీద చెయ్యి చేసుకున్న వాడిపై కోపం తో రగిలిపోతున్న కుర్రాడికి తాతగారు చెప్పిన మాటలు ప్రభావితం చేస్తాయి. తన అక్కని ఏడిపించిన వాళ్ళ పై తిరగబడతాడు. వీడి కోపం అనర్ధాలకి దారి తీయకూడదు అని మేడలో రుద్రాక్ష మాల వేస్తాడు తండ్రి. అది ఉండగా ఎవరిని కొట్టకూడదు, అది తనంతట తానూ తీయకూడదు. ఈ లాక్ వేసినప్పుడు ఇదెక్కడో మళ్ళీ స్క్రీన్ ప్లే  లో బలమైన సిట్యుయేషన్ లో రఫ్ ఆడించేయ్యటానికి ఉపయోగ పడాల్సిన లాక్. కానీ సింపుల్ గా తేల్చేసారు. ఎంత సింపుల్ గా అంటే ఫైట్ చెయ్యాలి అంటే ఎవడినైనా బాబు ఇది కొంచెం తీసిపెట్టు అని అడిగి తీసేసే అంత. కొన్ని రోజుల తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ ని కాపాడటానికి మర్డర్ చేస్తాడు, అదే పోలీస్ ఆఫీసర్ ముందు ఇంకో మర్డర్ చేసి అన్యాయం ని చూస్తూ నిద్ర ఎలా పడుతుంది సర్ అని క్వశ్చన్ చేస్తాడు. ఒక క్యారెక్టర్ ని అద్భుతం గా చిన్న పిల్లాడి రూపం లోనే ఎస్టాబ్లిష్ చేసేసారు. అక్కడ నుంచి హీరో ఎంట్రన్స్, కామెడీ తో అలరిస్తూ అదే పోలీస్ ఆఫీసర్ సాయం తో డీజే గా అప్పుడప్పుడు అనాయ్యం ని ఎదిరిస్తూ ఉంటాడు. ఫైట్ సాంగ్ ఫార్మటు లో పర్ఫెక్ట్ కమర్షియల్ బెగినింగ్ ని అందుకొని ఫ్రెండ్ పెళ్లి లో హీరోయిన్ తో ప్రేమ ఎపిసోడ్ మొదలు అవుతుంది. ఇంకొక పక్క కథ కి మెయిన్ పాయింట్ అయిన అగ్రీ డైమండ్ స్కాం గురుంచి, రొయ్యల నాయుడు గురుంచి మనకి తెలుస్తుంది. ఇంతలో బన్నీ ని బ్రాహ్మణ అబ్బాయిగా మనం అలవాటు చేసుకోవటం ఆ కామెడీ ని ఎంజాయ్ చెయ్యటం మొదలు పెడతాం. ప్రేమలో రిజెక్ట్ అవ్వటం, తన బాబాయి లాంటి చంద్ర మోహన్ ఆత్మహత్య చేసుకోవటం తో మెయిన్ పాయింట్ లో కి హీరో ప్రయాణం మొదలు అవుతుంది. ఆల్మోస్ట్ గంట తర్వాత ప్లాట్ పాయింట్ మొదలు అయినట్టు అన్నమాట. 

మిడిల్ - సమస్యాత్మకం : జనరల్ గా ప్లాట్ పాయింట్ నుంచి మిడిల్ కి మొదలు అయ్యే కథలో ఒక మార్పు చోటు చేసుకుంటుంది. అప్పటి వరకు సాధారణం గా ఉన్న సిట్యుయేషన్ అసాధారణం అవ్వటమో లాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పటి వరకు సాధారణం గా ఉన్న కుర్రాడు, తన లక్ష్యం కోసం ఏదైనా పెద్దగా / గొప్పగా చెయ్యాల్సి రావటం. కానీ ఇక్కడ అప్పటి వరకు తాను చేస్తున్న పనినే చెయ్యాల్సి వచ్చింది. అప్పటికే DJ గా అన్యాయాన్ని ఎదిరిస్తున్న హీరో తన ఫ్యామిలీ లో వ్యక్తి కి అన్యాయం జరిగితే కచ్చితం గా ఎదిరిస్తాడు. చిన్నప్పుడే కిల్లర్ గా చూసేసిన హీరో ఇప్పుడు గొప్పగా తీసుకున్న నిర్ణయం ఎం ఉండదు . అప్పటికే ఫైట్స్ చేసేసిన హీరో ఇంకో కొన్ని ఫైట్స్ చేస్తాడు, అంతేగా అంతకు మించి ఎం ఉంటుంది? ఈ ఎపిసోడ్ వలన హీరో పాత్ర లో ఎదుగుదల లేకుండా పోయింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్లైన్ గా ఉండిపోయే క్యారెక్టర్ గా మిగిలిపోయింది. అసలు చిన్నప్పుడు ఎదో ఆవేశం తో జరిగిపోయింది అని ఊరుకొని, మళ్ళీ ఈ ఇష్యూ వచ్చినప్పుడు అదే పోలీస్ ఆఫీసర్ సహాయం తో సాల్వ్ చెయ్యాలి అని డిసైడ్ అయ్యి ఉన్న కూడా కథనం లో ఊపు ఉండేది, కాక పోతే ఫస్ట్ ఫైట్ పెట్టె అవకాశం మిస్ అయ్యేది.   అగ్రీ డైమండ్ ఓనర్ స్టీఫెన్ ని పట్టుకొని ఆ డబ్బులు మొత్తం జనాలకి అందించాలి అని డిసైడ్ అవుతాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఎలాగూ లవ్ నడపలేదు కాబట్టి హీరోయిన్ కే హీరో ప్రేమ విలువ తెలిసేలా సుబ్బారాజు ఎపిసోడ్ ప్లాన్ చేసారు. ఇదొక ప్లాంటింగ్ అని క్లైమాక్స్ లో పే ఆఫ్ అవుతుంది అని అందరికి తెలిసేలా రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి. (మెయిన్ విలన్ అయిన రొయ్యల నాయుడు కొడుకు సుబ్బరాజు అవ్వటం). హీరోయిన్ ఆ సంబంధం రిజెక్ట్ చెయ్యటం తో హీరో పై డైరెక్ట్ ఎటాక్ కి దిగుతాడు రొయ్యల నాయుడు. ఇక్కడ ఇంటర్వెల్ ఫైట్ ప్లాన్ చేసి ఫోన్ వార్నింగ్ తో ఇంటర్వెల్ ఇచ్చారు. ఇక్కడే గమనిస్తే నిన్ను నేను కలిసిన రోజు చంపేస్తా అంటాడు హీరో, విలన్ ని చంపేస్తే సినిమా అయిపోతుంది కాబట్టి క్లైమాక్స్ వరకు ఎలాగూ కలవాడు అని సగటు ప్రేక్షకుడికి హింట్ ఇవ్వటం కాకపోతే ఏంటి ఇది? అప్పటి వరకు కామెడీ తో లాగేసి సినిమా ఇంక సెకండ్ హాఫ్ లో ఉండేది ఎం లేదులే అనే రేంజ్ లో చతికిల పడిపోయింది. కనీసం హీరో కి తన సీక్రెట్ ఐడెంటిటీ రెవీల్ అయిపోతుంది ఏమో అనే భయం ఐన కల్పించి ఉండాల్సింది. అప్పుడు తన వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఏమో అని మధనం అయినా జరిగేది. ఇదే ఐడెంటిటీ సమస్య ని అడ్డం పెట్టుకొని శంకర్ గారు అయితే చెడుగుడు ఆడేసేవారు. 

గొప్పగా స్టార్ట్ అయిన హీరో పాత్రలతో ఉండే ప్రాబ్లెమ్ ఒకటే, అంత కంటే గొప్పగా ఉండాలి అని కోరుకుంటారు ప్రేక్షకులు, అంత కంటే కష్టమైన సందర్భాలు పేస్ చెయ్యాలి అని ఆశిస్తారు, అప్పుడేగా హీరోయిజం పండేది. అయినా అప్పటి వరకు డీజే ఎన్నో కేసు లు డీల్ చేసినా కూడా పోలీస్ లు ఎం చేస్తునట్టు. అవన్నీ కామన్ పోలీస్ స్టేషన్ లో పెండింగ్ కేసు లు అని క్లియర్ గా తెలిసినప్పుడు సాల్వ్ చెయ్యటం ఎంత సేపు పని? ఆలా సాల్వ్ చేసే ప్రాసెస్ లో పోలీస్ లు కూడా డీజే వెనక పడి ఉంటె, ఒక పక్క పోలీసులు ఇంకొక పక్క తాను తీర్చుకోవాల్సిన పగ, ఇంకోపక్క ఐడెంటిటీ ఇష్యూ అంటూ కథనం మంచి రక్తి కట్టేది, కానీ ఎందుకో ఆ ప్రాసెస్ ఎంచుకోలేదు. 

ఇంత గొప్ప వార్నింగ్ ఇచ్చాక సెకండ్ హాఫ్ లో ఇంక జగన్నాథమ్ కంటే డీజే ఎక్కువ స్పేస్ తీసుకోవటం జరుగుతుంది. హీరోయిన్ కేవలం పాటలకే పరిమితం అవ్వటం జరుగుతుంది. అక్కడక్కడా స్పేస్ తీసుకొని కామెడీ పండించారు కానీ, హీరో కి సీరియస్ లక్ష్యం ఉన్నప్పుడు కామెడీ అందులో ఎంత వరకు ఇమడదు. అన్యాయం అంటేనే నిద్ర పట్టని హీరో అవసరం అయితే పది రోజులు ఇంట్లో వేరే పని ఉంది అని చెప్పి అయినా వెళ్ళిపోయి సాల్వ్ చేసెయ్యాలి? మరి ఆలా అయితే మాస్ కి సాంగ్స్ ఎలా? కాబట్టి మనం మనకి తెలిసినా ఫార్మటు లోనే పోదాం. మొత్తం కథనం లో ఎక్కడ ట్విస్ట్స్ లాంటివి ప్లాన్ చేసుకోక పోవటం కూడా కొంచెం శోచనీయం. రొయ్యల నాయుడు కి విషయం అర్ధం అయ్యి ఎటాక్ కి దిగుతాడు. సిస్టర్ ని, ఫ్రెండ్ ని ఇబ్బంది పెడతాడు. ఫ్యామిలీ అయినా సరే వదిలే ప్రసక్తే లేదు అని అత్యునత భావాలతో వాళ్ళని కాశీ కి పంపేసి ప్రత్యక్ష యుద్దానికి దిగుతాడు. అప్పటి వరకు సినిమా లో హీరో కి కానీ విలన్ కి కానీ డైరెక్ట్ డీలింగ్ ఉండదు. డీజే క్యారెక్టర్ లో ముసుగులో హీరో విలన్ బినామీ తో తల పడుతూ ఉంటాడు. ముసుగు వర్సెస్ ముసుగు మజా ఏముంటుంది ? అప్పటి వరకు పాసివ్ గా ఉన్న క్యారెక్టర్ కి ఆక్టివ్ గా మారె సమయం ఈ ఎపిసోడ్ తో వచ్చింది. ఆ సార్ పేరు ఏంటో చెప్పండి సర్ సినిమా టెంపో ని నిలబెడుతుంది. చూస్తున్నప్పుడు మనకి విశ్వరూపం చూస్తున్న ఫీలింగ్ కలుగుతున్న దానితో దేనికి పోలిక లేదు ఎందుకంటే ఇక్కడ ఎం జరుగుద్ది అని మనకి ముందే తెలుసు కాబట్టి. ఓపెన్ అయిపోయి హీరోయిన్ కి అసలు విషయం చెప్పేసి లాస్ట్ సాంగ్ ఏసుకోవటం తో కథ క్లైమాక్స్ కి వెళుతుంది. 

ఈ కథనం కి రెండు కాయి కచోరే లాక్ లు పడిపోయాయి, ఈ ఎపిసోడ్ వరకు విలన్ కి హీరో కి డైరెక్ట్ మీటింగ్ లేక పోవటం వలన, అలా కలిసినరోజే చంపేస్తాను అనే వార్నింగ్ ఉండటం వలన హీరో అండ్ విలన్ క్యారెక్టర్ లు పాసివ్ గా మిగిలిపోయాయి. ఇంటర్వెల్ కే కలవటాలు, ఎత్తులు పై ఎత్తులు లాంటి వాటికీ స్కోప్ లేకుండా పోయింది. ప్రీ ఇంటర్వెల్ లో అంత భారీ ఆక్షన్ ఎపిసోడ్ పెట్టుకున్నాక క్లైమాక్స్ లో ఫైట్ అంటే జనాలు బోర్ ఫీల్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి కామెడీ ట్రై చెయ్యాల్సి వచ్చింది, కానీ హీరో ఆశయం ముందు, లక్ష్యం ముందు కామెడీ చేస్తే క్యారెక్టర్ దెబ్బ తినాల్సి రావటం జరుగుతుంది. 

ముగింపు: ఏ సినిమా కి అయినా క్లైమాక్స్ ఆయువుపట్టు. అప్పటి వరకు ఉన్న కొద్దీ కొద్దీ మిస్టేక్స్ కూడా ఆడియన్స్ క్షమించేసే టైం. ఎంత కామెడీ సినిమా అయినా, సీరియస్ సినిమా అయినా క్లైమాక్స్ ఏ జస్టిఫికేషన్. ప్రీ క్లైమాక్స్ లో భారీ ఫైట్ పెట్టడం వలన కామెడీ ని నమ్ముకోవటం తప్ప వేరే దారి కనపడలేదు. అసలు అంత పెద్ద మొత్తం డబ్బుని మానసిక రోగం ఉన్న కొడుక్కి అప్పగించటం ఏంటి? ఇండియా నుంచి బయటికి పంపించిన డబ్బుని మళ్ళీ ఇండియా రప్పించటం ఎందుకు అది బయట ఉంటేనే సేఫ్ కదా? లాంటి పాయింట్స్ ఆలోచించనివ్వకుండా పుల్లమ్మ కామెడీ కి తెరతీశారు. వీరోచితమైన హీరో సుబ్బరాజు తో కామెడీ చేస్తుంటే సుబ్బరాజు మానసిక స్థితి పై జాలి కలుగుతుంది కానీ హీరోయిజం ఎలా ఉంటుంది. రేస్ గుర్రం సినిమాలో ఇలాగే ట్రై చేసినా అక్కడ హీరో కి వేరే ఆప్షన్ లేక పోవటం వలన అది వర్కౌట్ అయ్యింది. ఇక్కడ హీరో ని డిఫెన్సె లో పెట్టడానికి విలన్ పావులు కదిపినప్పుడు కథ డైరెక్ట్ గా క్లైమాక్స్ కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. హీరోయిజం ని పక్కన పెడితే సుబ్బరాజు కామెడీ కొంత వరకు నవ్వించింది. ఇదే కామెడీ కి కనెక్ట్ అయ్యి థియేటర్ లో పగలబడి నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి. ఫైనల్ గా డీజే ఎవరు అనేది జనాలకి తెలియకుండా ముగించారు ఎందుకంటే కథ లో కాన్సెప్ట్ అదే కదా. మనం చేసే పనిలో మంచి కనపడాలి కానీ మనిషి కనిపించాల్సిన అవసరం లేదు. 

చివరిగా : పాత్రలు ఔచిచ్యాలూ మనకి ఎందుకు మాస్టారు, లక్ష్యాలు లాంటి పెద్ద పదాలు మనం ఎం చేసుకుంటాం చెప్పండి.. అందరికి సౌకర్యం గా ఈ కథ గురుంచి చెప్పుకున్న లైన్స్ ఇంకోసారి మననం చేసుకుంటే ..  

"కామెడీ ని మనం నమ్ముకుంటే అదే మన సినిమా ని కాపాడుతుంది"

"మనం చూపించే సినిమాలో కామెడీ కనిపించాలి కానీ కథ కనపడనవసరం లేదు"

పై రెండు సూత్రాలు మేకర్స్ నమ్ముకున్నట్టు ఉన్నారు, అది నమ్మే ప్రేక్షకులు కూడా ఈ సినిమా కి బ్రహ్మరథం పడతారు. కుర్చున్నంత సేపు ఎంజాయ్ చేశామా వచ్ఛేసామా అనేది మాత్రమే ఎజెండా అయితే దువ్వాడ ఒకసారికి ఓకే కానీ  సినిమా మాత్రం రోటీనః రోటీనస్య రోటీబ్యాస్య . సెకండ్ హాఫ్ లో కూడా కామెడీ కరెక్ట్ గా పండి ఉంటె రేంజ్ ఇంకా పెరిగి ఉండేది. ఏది ఏమైనా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రతి రూపాయి పైన అల్లు అర్జున్ స్టామినా అని వ్రాసి పెట్టాలి. 


5 comments:

Anonymous said...

simple ga cheppali ante adbuthaha

Anonymous said...

very good analysis sir keep it up

Anonymous said...

Arachnid Amma mogudu darling

avadani said...

rachaha rachobyaha

Anonymous said...

very well written boss

 

Followers

About Me

My photo
Na gurunchi nene cheppukunte em bavuntundi..... aina cheppukune antha charithra em ledhu ikkada. Meku andariki telisina me pakkinti kurrodu type :)

Views